శ్రీధర్ అని నాకొక తాత ఉండేవాడు. వరుసకు తాత కాని అతని వయసు నాకన్నా నాలుగేళ్ళు పెద్ద. కాని తాత వరుసకు సరిపడ జుట్టు రాలిపోయింది. అతనికి ఒక చిరకాల వాంఛ ఉండేది. అదేంటంటే........
దిల్’షుక్ నగర్ లో సాయంత్రం అయితే కాలేజి అమ్మాయిలతో బస్ స్టాపులన్నీ నిండిపోయి ఉంటాయి. చిన్న పిల్లల నుండి, ముసలి వాళ్ళదాకా, అమ్మయిల నుండి అమ్మమ్మల దాకా అందరూ గుంపులుగా కదులుతూ ఉంటారు. మా వాడికున్న రాక్షస సరదా ఎంటంటే, " అందంగా ఉన్న అమ్మాయిలకు హాయ్! అంటూ చెయ్యి ఊపాలని." మనవాడేమో ఊరికి కొత్త సరుకు. అమ్మయిలు దగ్గరకొస్తే చెయ్యి కాదు కదా, తల కూడా ఎత్తలేడు.
"బాబూ శ్రీధరూ! ఒక్క అమ్మాయికి చెయ్యి ఊపడానికి అలెగ్జాండరు దండయాత్ర లాగా నన్ను వారం రోజుల నుండి ఈ రోడ్ల మీద తిప్పుతున్నావు. ఈ రోజయినా ఊపుతావా లేక, ఈ రోజుకూడా వాయిదా వేస్తావా?" పెళ్ళాం తప్పిపోయిన మొగుళ్ళలా తిరుగుతున్నట్టనిపించి సహనం నశించి అడిగాను శ్రీధరు ను..
"శ్రీ!! ఈ రోజు ఊపుతాను చూడు" అన్నాడు ఎలక్షన్ల ప్రసంగం లో వాగ్ధానం చేసినట్టు. " ఆ అమ్మాయిలను చూడు. పంజాబీ డ్రెస్సులేసుకుని మన గళ్ళీ సైడు వెళ్తున్నారు. వాళ్లను ఫాలో అయ్యి వాళ్ళకు హాయ్! చెప్దాం పద!" అంటూ వెంటేసుకెళ్ళాను అతన్ని.
ఎం.బి.ఎ కోసం అని వచ్చి నేను ఉన్న ప్రైవేట్ హాస్టల్ లో చేరాడు. చదువుమాట దేవుడెరుగు! వారం రోజుల నుండి ఇదే తంతు. మంచోడని మంచమిస్తే, మంచింగ్ కోసం పిల్లెక్కడ అన్నట్టుంది పరిస్థితి. పోనీలే ఊరికి కొత్తకదా! ఊరు చూపిద్దాం అనుకుంటే.. ఊరును వదిలేసి ఊరకుక్కల వెంట పడ్డట్టుంది ఇతని వాలకం. ఏది ఏమయిన సరే! ఈ రోజు ఇతని ధూల తీర్చాలి అని నిర్ణయించుకున్నాక అతనితో ఆ అమ్మయిల వెనుక బయలుదేరాము.
ఎలుకల వెనుక పిల్లుల లా వాళ్ళ వెనుకాల బయల్దేరాము.కాసేపటికి వాళ్లను దాటి కొంత దూరం వెళ్ళి అక్కడ ఏదో మాట్లాడుకుంటున్నట్టు నిలబడ్డాము. వాళ్ళు దగ్గరకు వస్తున్నారు. ఏం కొంపముంచుతాడో అని నాకు ఒక వైపు టెన్షను గా ఉన్నా, వీడి సరదా తీరితే ఇంక వీడితో కాట్ వాకు లు ఉండవని తెగించి నిల్చున్నాను. ఒకసారి శ్రీధర్ మొహం చూశాను. చూడబోతే హాయ్ చెప్పేలా లేడు. ఎలాగయినా చెప్పించాలి. చెప్పించకపోతే రేపు కూడా ఈ క్యాటు వాకు తప్పదు. ఇంతలో వాళ్ళు దగ్గరకు రానేవచ్చారు.
"ఎక్స్క్యూజ్ మి! ఇతను మా తాత! ఇక్కడ ఎం.బి.ఎ చదవాలని మొన్ననే సిటి వచ్చాడు. మీకు హాయ్! చెప్పాలని వారం రోజులనుండి ట్రై చేస్తున్నాడు. ప్లీజ్! దయచేసి ఒక్కసారి హాయ్ చెప్పించుకోండి" అని గడ గడా చెప్పేసి అక్కడనుండి పక్కకు జారుకున్నాను. ఇంతలో వారిలో అందరికన్నా పొడవుగా ఉన్న అమ్మాయి "ఏరా బట్టతలోడా! చెప్పుతో కొడితే ఉన్నా ఆ నాలుగు వెంట్రుకలు ఊడిపోతాయి. అమ్మాయిలకు హాయ్ చెప్తావా! టీజింగ్ చేస్తున్నావని కేసు పెడితే లైఫులో ఎందుకు పనికి రాకుండా పోతావు." అని సీరియస్ గా చెప్పి అక్కన్నుండి వెళ్ళిపోయారు.
....
రోజులు గడిచి తొండ ముదిరి ఊసరవెల్లయింది. (సిటి కొంచెం అలవాటయి దోస్తులు దొరికారు.) ఆ అమ్మాయిల కోసం మా తాత అతని దోస్తుమూక మా గల్లీలలో నిరీక్షణ, ఎలాగయినా ఏడ్పించాలని. కాని వాళ్ళు మా గల్లీకి రారు. నా ఫ్రెండ్స్ కదా వాళ్ళు. నాకోసం వచ్చారు ఆ రోజు. మా తాత బాధ భరించలేకను అతన్ని తిట్టించడానికి నేనే పిలిపించాను మరి.
Wednesday, August 8, 2007
Subscribe to:
Post Comments (Atom)
5 కామెంట్లు:
పొ.ప.న.:-))
పొ.ప.న? అంటే ఏంటి కొత్త పాళి గారు.?
పొ.ప.న. = పొట్ట పగిలేలా నవ్వాను! :-)
ROFL!
cat walk...navvaleka chachipoyanu...chala bavundi :)
Post a Comment