మంగళవారం 7 ఆగస్టు 2007

తాత నుయ్యి తవ్వితే- మనవడు గొయ్యి తవ్వాడంట!!

దీన్నే రాజకీయం అంటారు. తాతల కాలం నాడు వాళ్ళకు పెద్దగా దురాశలు ఉండేవి కావు. కాని ఇప్పుడు-ఊరు శాంతి కోసం ఊరు కుక్కను కోస్తున్నాం అంటే "ఇంటికి మూడు కిలోలు పంపు" అంటున్నారు. తాత పేరు చెప్పుకుని గద్దెలెక్కేస్తున్నారు. నువ్వేం చేశావురా మగడా!! అంటే "నేను ఈదిన చెరువు రెండు మైళ్ళు" అన్నట్టు గొప్పలు చెప్తారు. (వివరణ: నేను ఈదిన చెరువు రెండు మైళ్ళు అంటే రెండు మైళ్ళ చెరువును ఈదడం కాదు. "తను ఈదిన చెరువు అక్కడి నుండి రెండు మైళ్ళ దూరం లో ఉంది" అని.) ’రాష్ట్ర రవాణా శాఖ రోడ్లు అన్నీ నేనే స్వయంగా వేయించాను’ అంటారు. ఆ గొప్పలు విని "సారూ! నీ కాల్మొక్కుత బాంచను. మా ఇండ్లకు పట్టాలిప్పించండి" అని మొరపెట్టుకున్న గూడు లేని పేదోడితో, " నిన్ననే రైల్వే శాఖ వాళ్ళకు కొత్త పట్టాలెయ్యమని చెప్పాను. ఇప్పుడు అదేపనిలో ఉన్నాము. అది అయిపోగానే మీకు ఇస్తాము." ఏ పట్టాలు ఏంటో తెలియని అమాయకులకు నమ్మబలుకుతారు.

ఉచితకరెంటేంటండీ! మరీను..!! విడ్డూరంగా లేదు? నేను పుట్టిన ఊరుకు ఇప్పటికీ పంటలు పండించడానికి అనువయిన పవర్ సప్లై లేదు. "పళ్ళెలు దేశానికి పట్టుకొమ్మలు" అన్నారు పెద్దలు. పెళ్ళానికి ఒళ్ళు రుద్దుకోవడానికి ఇటుక రాయి ఇచ్చి, ఉంచుకున్న దానికి లక్స్ సబ్బు ఇచ్చినట్టుంది. తాతల కాలం నాడు పల్లెల ఉన్నతి కోసం చెరువులు తవ్విస్తే, మనవళ్ల కాలం వాళ్ళు పల్లె ప్రజలకు గోతులు తవ్వుతున్నారు. కంప్యూటర్లొచ్చాయని అన్నం తినడం మానేస్తున్నామా? ఒకరొచ్చి హైటెక్ సిటీ, ఇంకొకరు హైటెక్స్. జన్మభూమి అంటూ వారానికొకసారి సిటి లో రోడ్లేయించిన గత ప్రభుత్వం పల్లెను గాలికొదిలింది.అది సరే! మరి రైతుల పేరు చెప్పుకుని వచ్చిన ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు. "అబ్బో!! చేస్తుంది లెండి! వర్షాలు వచ్చే సమయానికి కృత్రిమ వర్షాలు ఏర్పాటు చేస్తుంది. నఖిలి విత్తనాలు సప్లై చేస్తుంది" ఏదో టి.వి. 9, ఈ టి.వి. 2 మరికొని న్యూస్ ఛానళ్ల దయ కాని లేకపొతే " రహస్యం గా బల్లకింద పెడుతున్న చెయ్యి, గొంతుకు బిగుసుకుని మరీ ముడుపులు వసూలు చేసేది." ఇక పోతే అటవీ శాఖ. నేటి అడవుల్లో తంగేడు చెట్లే మహా వృక్షాలు. పోనీ అక్కడ వ్యవసాయం చేయిద్దామా? అంటే అడవులు నరకకూడదు." ఏంటి నరికేది? ఆ తంగేడు చెట్లా? వంద చెట్లు నరికినా పది మందికి అంబలి కాయడానికి కూడా పనికి రావు."

"ఈ వ్యవసాయం గోల ఎందుకు కాని? బస్టాండులో బఠానీలమ్ముకుందామా?? బాగుంది కదా నా సలహా? "

ఇది మరీ బాగుందయ్యా? ఫైవ్ స్టార్ హోటళ్ళో తిన్నా చివరకు పాయఖానా కే వెళ్ళాలి. ఇంకా అర్థం కాలేదా? " బఠానీల కోసం కూడా వ్య్వసాయమే చేయాలయ్యా!!"

(ఇది వాస్తవం! ఇది చదివే వాళ్ళలో ఆయా పార్టీలకు ఫాన్స్ ఉండొచ్చు. రాజకీయాల మీద వ్యాఖ్యలు చేయాలంటే కొంచం భయమే! రాజకీయం ఒక బురద. వ్రేలితో వొంటికి రాసుకున్నా, దాన్లో రాయేసినా ఒకటే!!)
నిన్న మహబూబ్నగర్ లో రోడ్డు మీద వ్రేలాడుతున్న కరెంటు తీగ తగిలి తల్లీ, బిడ్డ మృతి. మన రాష్ట్రం లో చావడానికి కరెంటు ఉచితం.

2 కామెంట్లు:

  1. మీ బ్లాగు చాలా బాగుంది

    మీరుండేది హైదరాబాదే అయితే ఈ సారి ఆదివారం మన బ్లాగర్ల మీటింగుకి రావడానికి ప్రయత్నించండి

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ధ్యన్యవాదాలు కిరణ్ గారు! నాది హైదరాబాదే కాని నేను ప్రస్తుతం హైదరాబాదులో లేను. సాధ్యమయినంతవరకు ప్రయత్నిస్తాను.

    ప్రత్యుత్తరంతొలగించు