ఘనీభవించిన నా హృదయం లో
కన్నీళ్ళు ఇంకిపోతున్నాయి.
ఎండకు ఎండి, వానకు తడిచి
చలిలో మొద్దుబారిన నా హృదయం..
షాజాహాన్ తాజ్‘మహల్ లా శిధిలమవుతూ..
ఆగిఆగి సవ్వడి చేస్తుంది.
ఎక్కడో దూరంగా నువ్వు..
ఆకాశం లో అరుంధతీ నక్షత్రంలా!!
స్మశాన నిశ్శబ్దం లో,
పెళ పెళ మని శబ్దం చేస్తూ,
నా కదలిక నీ వైపుకు-
విఫలయత్నం చేస్తూ..
అప్రయత్నం గా..
ప్రాణం లేని నా గాజు కళ్ళలో
ఒక కన్నీటి బిందువు.
...
లబ్ డబ్..
లబ్ డబ్..
నిశ్శబ్దం..
నిశ్శబ్దం..
నిశ్శబ్దం..
స్థబ్దమయిందా కాలం..
లేదే..
నాలా ఒంతరిదయిన ఒక వీధి దీపం..
మిలుకు మిలుకు మంటూ..
మతం గోడల్లాంటి నల్లని చీకటి కవచాల్ని,
చీల్చే విఫల యత్నం చేస్తూ
తన ఉనికిని చాటుతుంది..
మరి నా ఉనికి ఎక్కడ???
...
...
తుఫాను సమయం లో నీ చేజారిన
నా మనసు గొడుగు,
దూరం గా కొట్టుకు పోతూ,
నీకేసి చూస్తూ,
మౌనం గా రోదిస్తుంది..
నీవు పీల్చే ఆ గాలిలో నా శ్వాస లేదు.. ..
నీ మనసులో చోటు సంపాదించలేని నన్ను,
ఈ ప్రపంచం కూడ వెలివేస్తుంది.
...
ఇది ముగింపు కాదు..
నీ ప్రేమకోసం వేచే
నా మనోగమనానికి
ఇదే ఆరంభం...
మళ్ళీ కలుస్తా..
నీ ప్రేమను అర్థిస్తూ..
******
టక్ టక్..
టక్ టక్..
కుమ్మరి కొలిమిలో కాలిన ఉక్కును,
నలగ్గొడుతున్న శబ్దం..
కర్ణభేరి పగిలిపోయేలా..
భుజం మీద అసహనం తో కూడిన స్పర్శ..
నన్ను ఊపేస్తున్నట్టు..
కళ్ళు తెరిస్తే..
ఎదురుగా కండక్టర్..
వన్ మాన్ ఆర్మీ లాగా..
"మీ ఊరు వచ్చింది..."
...
నాలో నేను నవ్వుకున్నాను.. నా ఊహలకు.
బస్ దిగి అన్ని దిక్కులూ చూశాను..
దిక్పాలకుని లా..
ఎదురుగా..
ఆ ఇల్లే..
ఎన్నేళ్ళనుండో మార్చకుండా,
త్రుప్పే భారంగా విరిగి వ్రేలాడుతున్న
ప్రాణం లేని గేట్,
ముట్టుకోవాలనే ఆలోచనకే కూలిపోయేలా ఉన్న
శిధిలమయిన గోడ.. చైనా గ్రేట్ వాల్ లా..
తొంగి చూశాను..
పది సంవత్సరాల క్రితం
ఎలా దొంగ చూపులు చూశానో అలా!!
...
గూడ్సు రైలు లా శబ్దం చేస్తూ గేట్ తెరుచుకుంది.
తనే!!
తనతో ఇద్దరు పిల్లలు...
ఎక్కడికో బయల్దేరుతున్నట్టున్నారు..
తనలో ఏ మార్పు లేదు..
అదే అందం..
అదే అమాయకత్వం..
అదే నాజూకుతనం..
.. ఎంత అందం...
తను నన్నే చూస్తుంది..
నా వైపుకే వస్తుంది..
పిల్లలు పిలుస్తున్నారు డాడీ అంటూ..
బుడి బుడి అడుగులు వేస్తూ..
అచ్చం బుల్లి చందమామల్లా..
"ఏమండీ!!
ఇదేనా రావడం..
ప్రయాణం ఎలా జరిగింది.."
తను అడుగుతుంది..
నన్నేనా???
వెనక్కు తిరిగి బిత్తిరి చూపులు చూశాను..
ఎవరూ లేరు...
"ఏంటండీ అలా పిచ్చి చూపులు చూస్తున్నారు.."
తన ప్రశ్న..
*****
రణభేరి లా సెల్‘ఫోన్ మ్రోగడంతో,
కలల మేఘం దారి మళ్ళీంది.
..
అంతా మాయ..
::శ్రీ::
శుక్రవారం 28 డిసెంబర్ 2007
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
0 కామెంట్లు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి